
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సూత్రదారులు అందరూ ఒకరొకరుగా అరెస్ట్ అవుతున్నారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన అరుణ్ పిళ్ళైని ఈడీ అధికారులు మంగళవారం రాత్రి ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
ఈడీ అధికారులు ఆయనను ఢిల్లీలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచి, కోర్టు అనుమతితో వారం రోజులు తమ కస్టడీ తీసుకొన్నారు. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణ సమయంలో అవసరమైన మందులు వాడేందుకు, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుకొనేందుకు కోర్టు అనుమటించింది.
ఈడీ అభియోగాల ప్రకారం ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆయన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామిగా వ్యవహరిస్తుండగా, మరో భాగస్వామి ప్రేమ్ రాహుల్ ఏపీలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డిలకు బినామిగా వ్యవహరిస్తున్నారు.
ఈ కుంభకోణంలో ‘సౌత్ గ్రూప్’లో వీరందరితోపాటు శరత్ చంద్రరెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు మరికొంతమంది ఉన్నారు. వీరందరూ ఢిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వంలో నేతలతో ఢిల్లీ, హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో పలుమార్లు చర్చలు జరిపి, ఇండో స్పిరిట్స్ సంస్థకు ఆర్ధిక లబ్ధి కలిగేలా ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీని రూపొందించారు.
ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ పేర్కొంది. పంజాబ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ఆమాద్మీకి అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో ‘సౌత్ గ్రూప్’ సభ్యులు వందకోట్లు లంచం అడ్వాన్సుగా చెల్లించారని, దానికి ప్రతిఫలంగా 2022 సెప్టెంబర్ 23న ఢిల్లీ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ఓ లేఖ ప్రకారం ఇండో స్పిరిట్స్ సంస్థకు రూ.1892.80 కోట్లు లాభం వచ్చిందని ఈడీ అభియోగంలో పేర్కొంది. ఆ సొమ్ముకు సంబందించి బ్యాంక్ రికార్డులు పరిశీలించినప్పుడు దానిలో రూ.25.50 కోట్లు అరుణ్ పిళ్ళై ఖాతాకు బదిలీ అయిన్నట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత త్వరలో అరెస్ట్ కాబోతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితర బిజెపి నేతలు చెపుతున్న సంగతి తెలిసిందే. ఈడీ అభియోగాల ప్రకారం ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆమెకు బినామీగా ఉన్న అరుణ్ పిళ్ళైని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు కనుక తర్వాత ఆమెకు, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నుంచి పిలుపు వస్తుందేమో?