చెరుకని నమిలేస్తామంటే ఎలా వెంకట్ రెడ్డిగారు?

సీనియర్ కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌లకు మూడు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ చేసి బెదిరించారు. “జిల్లా అంతటా నా అనుచరులు కార్లు వేసుకొని తిరుగుతున్నారు. వారం రోజులలోగా మీ ఇద్దరినీ చంపేస్తారు. మీ హాస్పిటల్‌ను ధ్వంసం చేస్తారు. వారిని ఆపడం నా వల్లకాదు,” అంటూ వెంకట్ రెడ్డి వారిని బెదిరించారు. ఆ బెదిరింపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. 

అయితే అది కేవలం భావోద్వేగంతో అన్న మాటలే తప్ప వారిని చంపేసే అంత కోపం, కక్ష తనలో లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చుకొన్నారు. తాను మాట్లాడిన మాటలలో మద్యలో ఉన్న సంభాషణను ఎడిట్ చేసి తీసేసి, మొదట, చివర్లో మాట్లాడిన మాటలనే తండ్రీకొడుకులు  మీడియాకు లీక్ చేశారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. 

కానీ చెరుకు సుధాకర్, సుహాస్ ఈ బెదిరింపులను తేలికగా తీసుకోలేదు. డాక్టర్ చెరుకు సుహాస్ సోమవారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకట్ రెడ్డిపై సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపులు)కింద కేసు నమోదు చేశారు. వారు ఈ సంభాషణను పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రేకి కూడా పంపించి, పార్టీ పరంగా కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.