మేడమ్... ప్రీతి మృతిపై రాజకీయాలు చేయొద్దు!

కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్ధి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొన్న డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఉదయం గిర్ని తండాకు వచ్చిన నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్‌కు గ్రామస్తుల నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది. 

ప్రీతి కుటుంబ సభ్యులని పరామర్శించి తిరిగివెళుతునప్పుడు విలేఖరులతో మాట్లాడుతూ, ప్రీతికి న్యాయం జరగలేదని, పీజీ మెడికో అయిన ప్రీతికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం పదిలక్షలు ఏమాత్రం సరికాదని, కనీసం కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కెఎంసీలో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీవిత రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. 

అప్పుడు గ్రామ సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, గ్రామస్తులు కలుగజేసుకొని ప్రీతి చనిపోయినందుకు తామందరం ఎంతో బాధపడుతున్నామని, ఇప్పుడు ఆమె మృతిపై రాజకీయాలు చేయవద్దని ఆమెని సున్నితంగా హెచ్చరించారు. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో రూ.20 లక్షలు ఇచ్చి ఆదుకొన్నారని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకొందని, ప్రీతిని వేధించిన డాక్టర్ సైఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని కనుక ఈ కేసు గురించి మాట్లాడొద్దని చెప్పి పంపించేశారు. తాను ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతుంటే గ్రామస్తులు మాట్లాడొద్దని చెప్పడంతో జీవిత రాజశేఖర్‌ ఆగ్రహంగా కారులో తిరిగి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు.