మీ చేతిలోనే పెన్నుంది కదా మేడమ్... సంతకం చేయొచ్చు కదా?

తెలంగాణ ప్రభుత్వం-రాజ్‌భవన్‌ మద్య మొదలైన పోరాటాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోషల్ మీడియాకి తీసుకువెళ్లడంతో దానికీ విస్తరించి అక్కడా కొనసాగుతోంది. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరే కదా వచ్చి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవచ్చు కదా? గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు?అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశ్నిస్తే, “గవర్నర్‌గారు ఈ ట్వీట్‌ కంటే మీ సంతకమే చిన్నది. బిల్లులపై సంతకం చేయొచ్చు కదా?” అని ఒక నెటిజన్ ట్వీట్‌ చేశారు. 

“రాజ్‌భవన్‌ వరకు ఎందుకు మేడమ్? రాజ్‌భవన్‌లోనే మీ కార్యాలయం ఉంది... మీ చేతిలోనే పెన్నుంది కదా?కూర్చొని 10 సంతకాలు చేస్తే చాలు కదా?” అంటూ మరో నెటిజన్ ట్వీట్‌ చేశాడు. “మేడం గారు మీకు తెలంగాణ ప్రజలు జీతం ఇస్తున్నారు తెలంగాణ ప్రజల బిల్లులు ఎందుకు ఆపుతున్నారు మీరు రాజకీయం చేయాలనుకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవొచ్చు కదా? అని మాణిక్యం అనే పౌరుడు ట్వీట్‌ చేశారు.  

మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం నల్గొండలో గ్యాస్ ధరల పెంపు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విలేఖరులతో మాట్లాడుతూ, “గవర్నర్‌ రాజకీయ దురుదేశ్యంతోనే ప్రభుత్వం పంపిన బిల్లులపై సంతకాలు చేయకుండా తొక్కిపెట్టి ఉంచారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. గవర్నర్‌ పదవిలో ఉంటూ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తుండటం చాలా బాధాకరం. ఇకనైనా ఆమె పది బిల్లులపై సంతాకాలు చేసి హుందాగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.