ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఐడియా భలే పనిచేసిందే!

ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రభుత్వం తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు నిత్యం మొరాయిస్తోందని, తరచూ మరమత్తులు చేయించుకోవలసివస్తోందని కనుక ఆ వాహనాన్ని మార్చి కొత్తది ఇవ్వాలని చాలాసార్లు సిఎస్‌కి, హోమ్మంత్రికి, డిజిపికి లేఖలు వ్రాశారు. కానీ ఎవరూ స్పందించలేదు. ఇటీవల ఆయన దానిలో ప్రయాణిస్తుండగా మళ్ళీ మొరాయించింది. కనుక ఆయన బడ్జెట్‌ సమావేశాలకి ఓ రోజు తన బైక్‌పై వచ్చి మళ్ళీ ఈవిషయం ప్రభుత్వానికి తెలియజేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మర్నాడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకువచ్చి ప్రగతి భవన్‌ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 

ఇంతకాలంగా ప్రభుత్వానికి లేఖలు వ్రాసినా ఫలించలేదు కానీ ఈ చిన్న ఐడియా మాత్రం భలే పనిచేసింది. రాష్ట్ర హోంశాఖ సిబ్బంది వెంటనే మరో బుల్లెట్ ప్రూఫ్ కారుని ధూల్‌పేటలోని రాజాసింగ్‌ ఇంట్లోవారికి అప్పజెప్పి వెళ్లారు. ఆ సమయంలో రాజాసింగ్‌ శ్రీశైలం పర్యటనలో ఉన్నారు. 

ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిందనే విషయం తెలుసుకొన్న ఆయన ముఖ్యమంత్రికి, డిజిపికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. తనకు కొత్త వాహనమే ఇవ్వాలని ఎన్నడూ పట్టుబట్టలేదని, మొరాయించకుండా నడిచే వాహనమైతే చాలని చాలాసార్లు చెప్పానని కానీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ కారుని స్వయంగా పరీక్షించుకొన్నాక మళ్ళీ తన అభిప్రాయం తెలియజేస్తానని రాజాసింగ్‌ చెప్పారు.