గవర్నర్‌పై సుప్రీంకోర్టుకా... హవ్వ: బండి సంజయ్‌

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పు పట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్రలకు బయలుదేరినట్లుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. ఈ 8 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 వేల జీవోలని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టకుండా ప్రజలకి తెలియకుండా దాచి పెట్టింది. తద్వారా సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని దెబ్బ తీస్తోంది. 

ఈ 8 ఏళ్ళలో రాష్ట్ర హైకోర్టు కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో అందరికీ తెలుసు. తాను సిఫార్సు చేసిన వ్యక్తిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదించనందుకు కేసీఆర్‌ ఓ మహిళ అని కూడా చూడకుండా గవర్నర్‌పై కత్తి కట్టారు. ఆమెని నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో ఆమెతో గౌరవంగా వ్యవహరించిన్నట్లు నటించిన కేసీఆర్‌, బడ్జెట్‌ సమావేశాలు ముగియగానే ఆమెపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. 

గతంలో గవర్నర్‌ నరసింహన్ కాళ్ళకి వంగివంగి దండాలు పెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు ఓ మహిళా గవర్నర్‌ పట్ల ఈవిదంగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. గవర్నర్‌పై సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్‌ వ్యవస్థని అవమానించారు. ఆమెపై వేసిన పిటిషన్‌ని తక్షణం ఉపసంహరించుకొని ఆమెకి క్షమాపణలు చెప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను, “ అని బండి సంజయ్‌ అన్నారు. 

తెలంగాణ శాసనసభ ఆమోదించిన 10 బిల్లులని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలుపకుండా తొక్కిపెట్టి ఉంచారని, వాటిని ఆమోదించవలసిందిగా ఆమెని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.