22.jpg)
తెలంగాణ ఉద్యమాలలో చాలా కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌ని కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారో తెలీదు కానీ దాంతో ప్రజలు కూడా ఆయనకి దూరం అయ్యారు. ఒకవేళ ఆయన పోరాటాలను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకొని ఉండి ఉంటే ఆయన స్థాపించిన తెలంగాణ జనసమితిని కూడా ఎన్నికలలో గెలిపించి ఉండేవారు. ప్రజలు ఆయనకి దూరం అయినా ఆయన వారికి దూరంగా ఉండాలనుకోలేదు. అందుకే నిత్యం ప్రజాసమస్యలపై కేసీఆర్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.
“తెలంగాణ ఉద్యమాలని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్ స్పూర్తితో మార్చి 10వ తేదీన హైదరాబాద్‌లో ‘తెలంగాణ బచావో’ సదస్సుని నిర్వహించబోతున్నాము. సిఎం కేసీఆర్ రెండు మొహాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో నిరంకుశంగా వ్యవహరిస్తూ, ఢిల్లీ వెళ్లినప్పుడు తనకంటే గొప్ప ప్రజాస్వామ్యవాది మరొకరు లేరన్నట్లు మాట్లాడుతుంటారు.
చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కీ తెలంగాణ సాధించుకొచ్చానని కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటారు. అంటే తెలంగాణ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మరే నాయకులు లేకుండా ఆయన ఒక్కరే పొరాడి తెలంగాణ సాధించారా? లేదు కదా? రాష్ట్ర ప్రజలందరూ కలిసి కొట్లాడి తెలంగాణ సాధించుకొంటే ఆ క్రెడిట్ తనొక్కడిదే అన్నట్లు చెప్పుకోవడం, తన నేతల చేత చాటింపు వేయించుకోవడం సరికాదు. ఇది తెలంగాణ ప్రజలందరినీ అవమానించిన్నట్లే కదా?
ధరణి పోర్టల్‌తో రైతుల సమస్యలు తీరకపోగా ఇంకా పెరుగుతున్నాయి. కానీ అది బిఆర్ఎస్ నేతల భూకబ్జాలకి బాగా ఉపయోగపడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం పాత్ర చూస్తే వారు అధికారాన్ని ఏవిదంగా వాడుకొంటున్నారో, వారు ఏ స్థాయికి ఎదిగిపోయారో అర్దం అవుతోంది. కేసీఆర్ చెప్పే మాటలు, నీతులకి చేస్తున్న పనులకి ఎక్కడా పొంతన ఉండదు. ఎన్నికల కోసం ఏమైనా చెపుతుంటారు... ఏమైనా చేస్తుంటారు. కేసీఆర్ వైఖరి వలన తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోంది. అది ప్రజలందరికీ తెలియజేసి చైతన్యపరచడానికే ఈ సదస్సు నిర్వహించబోతున్నాము,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.