4.jpg)
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి మృతిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాళోజీ విశ్వవిద్యాలయానికి లేఖ వ్రాశారు. ప్రీతి ఆరోగ్యం సరిగాలేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సంజాయిషీ ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రీతిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోనే ఉంచి చికిత్స అందించి ఉండి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని, కానీ ఆమెకి అత్యంత కీలకమైన సమయంలో వరంగల్ నుంచి నీమ్స్ హాస్పిటల్ తరలించి ఆలస్యం చేయడం వలన ఆమె ప్రాణాలు కాపాడే అవకాశాలు కోల్పోయాయని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ కాలేజీలో విద్యార్ధినులు, జూనియర్స్ ర్యాంగింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని గవర్నర్ లేఖలో ప్రశ్నించిన్నట్లు తెలుస్తోంది. కాలేజీలలో ర్యాంగింగ్ అరికట్టడానికి తగిన చర్యలు, వ్యవస్థని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశించారు. మెడికోల భద్రత కోసం హాస్పిటల్, కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మెడికోల పనివేళలు, విశ్రాంతి సమయాలని ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
మహిళా మెడికోలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారు ఫిర్యాదు చేసేందుకు ఫిర్యాదు కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ప్రీతి ఎదుర్కొన్న వేధింపులు, ఆమె మరణంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారో కూడా తెలియజేయాలని గవర్నర్ లేఖలో కోరారు.