మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్ రాం ఇబోబీపై ఆ రాష్ట్రంలోని ఉక్రూల్ అనే ప్రాంతంలో సోమవారం ఉదయం సుమారు 10.30గంటలకి హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన ఉక్రూల్ లో ఒక ప్రభుత్వాసుపత్రిని ప్రారంభోత్సవం చేయడానికి మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి అక్కడికి హెలికాఫ్టర్ లో చేరుకొన్నారు. ఆయన హెలికాఫ్టర్ దిగి తన కోసం సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఎక్కగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపి పారిపోయాడు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి ఓక్ రాం ఇబోబీ త్రుటిలో ప్రనాపాయాన్ని తప్పించుకొన్నారు.
కాల్పులు జరిపిన వ్యక్తి ఎన్.ఎస్.సీ.ఎన్.ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో హెలిప్యాడ్ చుట్టూ చాలా పటిష్టమైన రిజర్వ్ పోలీసులతో చాలా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయబడి ఉంది. అయినా ఆ ఉగ్రవాది లోనకి ప్రవేశింఛి కాల్పులు జరపడమే కాకుండా మళ్ళీ తప్పించుకొని పారిపోవడం గమనిస్తే, అతనికి ఎవరో సహకరించినట్లు అనుమానం కలుగుతోంది. ఆ వ్యక్తి జరిపిన కాల్పులలో ఇద్దరు మణిపూర్ రైఫిల్స్ కి చెందిన జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తరువాత ముఖ్యమంత్రి ఓక్ రాం ఇబోబీ తన కార్యక్రమాన్ని రద్దుచేసుకొని అదే హెలికాఫ్టర్ లో తిరిగి ఇంఫాల్ వెళ్ళిపోయారు. భద్రతాదళాలు పరిసర ప్రాంతాలలో ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.