ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించిన తర్వాత ఐపీసీ 120బి, 477-ఏ సెక్షన్స్, అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7 కింద ఆయనని అరెస్ట్ చేసిన్నట్లు ప్రకటించారు. ఈ కేసు విచారణకి ఆయన ఏమాత్రం సహకరించలేదని కనుక అరెస్ట్ చేయవలసి వచ్చిందని సీబీఐ అధికారులు తెలిపారు. ఈరోజు సీబీఐ కోర్టులో ఆయనని హాజరుపరిచి రిమాండ్ కోరుతామని తెలిపారు. 

ఈ కేసులో తనని అరెస్ట్ చేయబోతున్నట్లు ముందే పసిగట్టిన మనీష్ సిసోడియా, నిన్న ఉదయం ఢిల్లీలో తన నివాసం నుంచి ఆమాద్మీ కార్యకర్తలు వెంటరాగా భారీ ఊరేగింపుగా రాజ్‌ఘాట్ చేసుకొని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “మహాత్మాగాంధీజీ, సర్ధార్ భగత్ సింగ్‌ స్పూర్తితో పనిచేసే మమ్మల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయంగా ఈ కేసులో ఇరికించి జైలుకి పంపించబోతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి మోడీ సర్కార్ విఫలయత్నాలు చేస్తోంది. వాటిలో భాగంగానే ఇటువంటి కుట్రలు చేస్తోంది. అయితే ఇటువంటి రాజకీయ వేధింపులతో జైలుకి పంపినా భయపడబోను,” అని అన్నారు. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ నేపధ్యంలో ఢిల్లీలో అల్లర్లు జరగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా ఢిల్లీలో పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించి, పలువురు అమాద్మీ పార్టీ నేతలని, కార్యకర్తలని పోలీసులు అదుపులో తీసుకొన్నారు. 

పలు రాజకీయ పార్టీలతో ముడిపడున్న ఈ కేసులో ఇప్పటివరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రరెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, గతంలో కల్వకుంట్ల కవితకి ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబుతో పలువుఋ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పుడు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్ట్ కావడంతో తర్వాత ఎవరు అరెస్ట్ కాబోతున్నారో? అంటూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.