బిఆర్ఎస్‌కి, కౌన్సిలర్ పదవికి భోగ శ్రావణి రాజీనామా!

ఇటీవల జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్‌ పదవికి రాజీనామా చేసిన బిఆర్ఎస్‌ కౌన్సిలర్ భోగ శ్రావణి శుక్రవారం తన కౌన్సిలర్ పదవికి, బిఆర్ఎస్‌ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, “నేను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆహ్వానించడంతో బిఆర్ఎస్‌ పార్టీలో చేరాను. శక్తివంచన లేకుండా జగిత్యాలలో పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేశాను. ఆ తర్వాత సిఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్‌ పదవి కూడా లభించింది. మునిసిపల్ ఛైర్ పర్సన్‌గా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, జగిత్యాల అభివృద్ధికి చాలా కృషి చేశాను. కానీ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సింగ్‌ స్వార్దపూరిత రాజకీయాలకి నేను బలవుతున్నాను.

ఎమ్మెల్యే సంజయ్ సింగ్‌ నన్ను ఏవిదంగా ఇబ్బంది పెడుతున్నాడో ఇదివరకు నేను బయటపెట్టినప్పటి నుంచి ఆయన నుంచి నాకు నిత్యం వేధింపులు, బెదిరింపు ఫోన్‌ కాల్స్ ఎక్కువైపోయాయి. నేను పార్టీతో మొరపెట్టుకొన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. కనుక గత్యంతరంలేని పరిస్థితిలో నేను ఈరోజు భారమైన హృదయంతో నా కౌన్సిలర్‌ పదవికి, బిఆర్ఎస్‌ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను,” అని చెప్పారు.