
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్‌బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాన్ని మూడు నాలుగు విడిభాగాలుగా ఢిల్లీలో తయారుచేయించి హైదరాబాద్ తీసుకువచ్చి, ట్యాంక్‌బండ్ వద్ద నిలబెట్టారు. ఆ ఫోటోని మునిసిపల్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ప్రస్తుతం విగ్రహాన్ని దాని స్థానంలో నిలబెట్టడం పూర్తయింది. ఇంకా తుదిమెరుగులు దిద్దాల్సి ఉంది. ఒకవేళ పనులు పూర్తయితే త్వరలో లేదా ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతి రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సమాచారం. అదే రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో నిర్మించిన తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది.
దళిత బంధు, గిరిజన బంధు, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం అన్నీ కలిపి చూస్తే ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓటర్లని ఆకట్టుకోవడానికి బిఆర్ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు అర్దమవుతోంది. సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో కూడా ప్రవేశిస్తున్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం అమలుచేస్తున్న ఈ పధకాల గురించి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌కి తమ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, ప్రాధాన్యతని నొక్కి చెప్పుకొని దేశవ్యాప్తంగా బడుగు బలహీనవర్గాల ప్రజలని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.