ఈరోజు మావోయిష్టులకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు తెల్లవారు జామున ఏపి-ఓడిశా సరిహద్దులలో (ఏ.ఓ.బి.) జరిగిన ఎన్కౌంటర్ లో ఒకేసారి 23మంది మావోయిష్టులు మృతి చెందారు. వారిలో 15 మంది పురుషులు, 8 మంది మహిళా మావోయిష్టులు ఉన్నట్లు తాజా సమాచారం. ఏ.ఓ.బి కి 10కిమీ దూరంలో ఓడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో రామగుర్హా అనే ప్రాంతంలో మావోలు సమావేశం అయినట్లు పోలీసులకి సమాచారం అందడంతో గ్రే హౌండ్స్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతానికి చేరుకొని వారిని చుట్టుముట్టినప్పుడు ఇరు వర్గాలకి మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నాతో సహా చాలా మంది ముఖ్యనేతలు చనిపోయినట్లు సమాచారం.
ఎదురుకాల్పులలో ఇద్దరు గ్రేహౌండ్ పోలీసులు కూడా గాయపడ్డారు. వారిరువురినీ హెలికాఫ్టర్ లో వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు ఎకె-47 తుపాకులతో సహా బారీగా ఆయుధాలు, ప్రేలుడు సామాగ్రి, సుమారు రెండు లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఎన్కౌంటర్ ని ఏపి డిజిపి సాంబశివరావు నిర్ధారించారు. మృతుల శవాలని గుర్తించి పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత వారి వివరాలని తెలియజేస్తామని విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు.
ఇటీవల కాలంలో ఇంత మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అవడం ఇదే మొదటిసారి. దీనిలో మావోయిస్ట్ అగ్రనేతలు వారి కుమారులు కూడా చనిపోయారన్న వార్తలు వరవరరావువంటివారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక భూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వరవరరావు వంటి నేతలు మావోయిష్టుల ఎన్కౌంటర్ జరుగగానే మీడియా ముందుకు గట్టిగా మాట్లాడుతుంటారు. వాటిని ఖండిస్తుంటారు. కానీ ఎన్కౌంటర్ లో మావోయిష్టుల దాడిలో గాయపడిన పోలీసుల పట్ల గానీ, సరిహద్దులలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులు మృతి చెందినప్పుడు కానీ మాట్లాడటానికి నోరు రాదు.