తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను జాతీయ మహిళా కమీషన్ నుంచి ఇటీవల నోటీస్ అందుకొన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మంగళవారం ఢిల్లీలో కమీషన్ సభ్యుల ఎదుట హాజరయ్యి వివరణ ఇచ్చుకొన్నారు. మహిళా కమీషన్ సభ్యులు తమ ప్రశ్నలకి మౌఖికంగాను, లిఖితపూర్వకంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి నుంచి సమాధానాలు తీసుకొన్నారు.
అనంతరం ఆయన ఢిల్లీలో తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్ పట్ల నేను అనుచితంగా మాట్లాడలేదని తెలియజేశాను. నేను హైదరాబాద్ చేరుకొన్న తర్వాత ప్రెస్‌మీట్‌లో అన్ని విషయాలు మాట్లాడుతాను,” అని క్లుప్తంగా ముగించారు.
తెలంగాణ శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించకుండా తొక్కిపెట్టి ఉంచుతున్నారని, ఆమె ఓ గవర్నర్‌లా కాకుండా బిజెపి నేతలా వ్యవహరిస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వాటినే జాతీయ మహిళా కమీషన్ సుమోటుగా స్వీకరించి సంజాయిషీ కోరుతూ పాడి కౌశిక్ రెడ్డికి నోటీసు పంపగా ఆయన ఆలస్యం చేయకుండా వెళ్ళి సంజాయిషీ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగుస్తుందా లేదా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య మరో కొత్త యుద్ధానికి నాంది పలుకుతుందా? త్వరలో తెలుస్తుంది.