ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి మహిళా కమీషన్‌ నోటీస్!

బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్‌ నోటీస్ పంపింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈనెల 21వ తేదీన ఉదయం 11.30 గంటలకి ఢిల్లీలో మహిళా కమీషన్‌ విచారణకి హాజరయ్యి సంజాయిషీ చెప్పాలని నోటీసులో పేర్కొంది. విచారణకి హాజరుకాన్నట్లయితే కమీషన్‌ చట్టపరంగా చర్యలు తీసుకొంటుందని నోటీసులో హెచ్చరించింది. 

 పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, శాసనసభ ఆందించి పంపిన అనేక బిల్లులని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించకుండా తొక్కిపట్టి ఉంచుతున్నారని, ఆమె గవర్నర్‌లా కాకుండా బిజెపి నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

మహిళా గవర్నర్‌ పట్ల ఈవిదంగా అనుచితంగా మాట్లాడినందుకు జాతీయ మహిళా కమీషన్‌ పాడి కౌశిక్ రెడ్డికి నోటీసు పంపింది. అయితే ఆమెని ఉద్దేశ్యించి పలువురు మంత్రులు, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఇంతకంటే తీవ్ర విమర్శలే చేశారు. కానీ అప్పుడు మహిళా కమీషన్‌ పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్‌ పట్ల అనుచితంగా మాట్లాడారంటూ నోటీసు పంపడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తెలంగాణ ప్రభుత్వానికి మద్య మళ్ళీ సయోధ్య కుదురుతున్నప్పుడు, జాతీయ మహిళా కమీషన్‌ ఈ నోటీసు పంపడంలో ఆంతర్యం ఏమిటో?