
తెలంగాణ ప్రభుత్వానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలగా, మరో కేసులో చాలా ఉపశమనం లభించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సీబీఐ విచారణ చేపట్టకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కానీ పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టుల నిర్మాణ పనులలో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ ఉల్లంఘనలకి పాల్పడినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ విధించిన రూ.920 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ప్రజలకి త్రాగునీటి సౌకర్యం కోసమే ఈ ప్రాజెక్టులో 7.15 టీఎంసీల మేరకు పనులు చేపట్టేందుకు అనుమతిస్తున్నామని, సాగునీటి అవసరాలకి కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కనుక ఈ ప్రాజెక్టులో 7.15 టీఎంసీలకి మించి ఎటువంటి పనులు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే దీనికి అనుమతిస్తున్నామని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య దఃర్మాసనం స్పష్టం చేసింది.