తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసు దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పుని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు సీబీఐ విచారణని నిలిపివేస్తూ స్టే ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత దవే కోరారు. కానీ సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. 

కనీసం ఈ విచారణ పూర్తయ్యేవరకు ఈ కేసులో సీబీఐ ఎవరినీ అరెస్ట్ చేయవద్దని ఆదేశించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తుని తాము నియంత్రించలేమని చెపుతూ ఈ కేసు తదుపరి విచారణని ఈనెల 27కి వాయిదా వేసింది. దీంతో సీబీఐ విచారణకి గ్రీన్ సిగ్నల్‌ లభించిన్నట్లయింది. 

ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ వద్దగల అన్ని రికార్డులు, సాక్షాధారాలు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు లేఖలు వ్రాశారు. కానీ సుప్రీంకోర్టుకి వెళుతున్నామనే నెపంతో ఇంతవరకు ఆ రికార్డులు వారి చేతికి ఇవ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణలో కలుగజేసుకోవడానికి నిరాకరించింది కనుక ఇప్పటికైఆ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబందించిన అన్ని రికార్డులు సీబీఐకి అప్పగిస్తుందా లేదో?

ఒకవేళ అప్పగించకపోతే ఈసారి సీబీఐ హైకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్‌ వేయవచ్చు. అప్పుడు సిట్‌కి అధికారులకి హైకోర్టులో మొట్టికాయలు పడవచ్చు. అలాగని అన్ని రికార్డులు సీబీఐకి అప్పగిస్తే ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి సీబీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది.

ఈ కేసుతో కేంద్రాన్ని, బిజెపిని కేసీఆర్‌ ఇరుకున పెట్టాలనుకొంటే, ఇప్పుడు ఈ కేసుతోనే నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్‌ని కూడా కేంద్రం ఇరుకున పెట్టడం ఖాయం. బహుశః అందుకే ఈ కేసు విచారణ చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా పోరాడుతోందనుకోవచ్చు.