హంగూ లేదు బొంగూ లేదూ: తలసాని

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ రాదని, కనుక హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, బిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోక తప్పదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘాటుగా స్పందించారు. 

ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హంగూ లేదు బొంగూ లేదు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. రాష్ట్రంలో బిఆర్ఎస్‌ని ఎదుర్కోగల పార్టీ మరొకటి లేదు. అయినా పోయి పోయి కాంగ్రెస్ పార్టీతోనే మేము పొత్తులు పెట్టుకోవాలా? దాని కధ ఎప్పుడో సమాప్తం అయిపోయింది. వామపక్షాలతో పొత్తుల గురించి సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకొంటారు. ఈటల రాజేందర్‌ మళ్ళీ బిఆర్ఎస్‌లోకి వస్తారో లేదో నాకు తెలీదు కనుక ఆయననే అడగండి. 

సచివాలయం ప్రారంభోత్సవం చేసుకొంటామంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని అనుమతించలేదు. కానీ ఏపీలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కడపలో స్టీల్ ప్లాంట్‌ భూమిపూజకి ఈసీ అనుమతించింది. నిష్పక్షపాతంగా నడుచుకోవలసిన రాజ్యాంగ వ్యవస్థలు తీరు అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తాము. సచివాలయంలో పనిచేస్తున్న కార్మికులు చలిమంట వేసుకొన్నప్పుడు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు,” అని చెప్పారు.