తెలంగాణ సిఎం కేసీఆర్ బుదవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద గల సుప్రసిద్ద ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకొన్నారు. ముందుగా హెలికాఫ్టర్లోనే కొండగట్టుపైన కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండరాయుడి గుట్ట తదితర ప్రదేశాలని చూశారు. అనంతరం ఆలయ పూజారులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి స్వయంగా అక్కడకి వెళ్ళి వాటి గురించి ఆలయ అధికారులని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత అందరూ కూర్చొని దాదాపు రెండు గంటలసేపు ఆలయపునర్నిర్మాణం గురించి చర్చించుకొన్నారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, “దేశంలో అతి పెద్ద హనుమాన్ మందిరం ఎక్కడ ఉందంటే కొండగట్టులోనే అని చెప్పుకొనేలా దీనిని ఆగమ శాస్త్రం ప్రకారం పునర్నిర్మించుకొందాం. దేశంలో అతిగొప్పగా హనుమాన్ జయంతి ఇక్కడే జరిపిద్దాము. ఒకేసారి వేలమంది హనుమాన్ దీక్ష ధారణ, విరమణచేయడానికి వచ్చినా ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ లేకుండా అత్యంత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా కొండచుట్టూ సుమారు 850 ఎకరాలలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపడదాం. సువిశాలమైన రోడ్లు, ఆన్నదాన సత్రం, పుష్కరిణి, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకొందాము. వీటన్నిటి కోసం ప్రస్తుతం మంజూరు చేసిన రూ.100 కోట్లకి అదనంగా మరో రూ.500 కోట్లు మంజూరు చేస్తాను. త్వరలోనే మరోసారి కొండగట్టుకి వచ్చి ఆలయాభివృద్ధి, విస్తరణ, సుందరీకరణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తాను,” అని చెప్పారు.