తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుదవారం జగిత్యాల జిల్లా, కొండగట్టులో పర్యటించనున్నారు. ముందుగా ఆంజనేయస్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన తర్వాత ఆలయాన్ని, పరిసర ప్రాంతాలని పరిశీలిస్తారు. కొండగట్టు అంజన్న ఆలయ పునర్నినిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కనుక సిఎం కేసీఆర్, అధికారులతో కలిసి కోనేరు, పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మవారి కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం, పరిసర ప్రాంతాలలో కలియతిరిగి పరిశీలిస్తారు. ఆ తర్వాత జగిత్యాలలోని జేఎన్టీయు క్యాంపస్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అధికారులు, ఆలయ ఈవో తదితరులతో ఆలయ పునర్ నిర్మాణం గురించి చర్చిస్తారు.
సిఎం కేసీఆర్ రేపే కొండగట్టులో పర్యటించాలనుకొన్నారు కానీ మంగళవారం ఆంజనీయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక వారికి అసౌకర్యం కలుగకుండా బుదవారానికి తన పర్యటనని మార్చుకొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొండగట్టు అంజన్న ఆలయాన్ని పునర్నిర్మిస్తానని కేసీఆర్ ఆనాడే హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు ఆ హామీని నిలుపుకోబోతున్నారు. యదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిన్నట్లుగానే కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తానని సిఎం కేసీఆర్ చెప్పారు.