ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ఇంకా బ్రతికే ఉన్నారంటూ తమిళ నేషనలిస్ట్ నేత నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. నేడు చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నారు. ఆయన అనుమతితోనే నేను ఈ విషయం ప్రకటిస్తున్నా. త్వరలోనే ఆయన మీడియా ముందుకు వస్తారు,” అని చెప్పారు.
నెడుమారన్ కి ఎల్‌టీటీఈ సన్నిహిత సంబంధాలున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకి ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడంలో, ఆ తర్వాత వారందరినీ జైలు నుంచి విముక్తి కల్పించడం కోసం జరిగిన సుదీర్గమైన న్యాయపోరాటంలో ఆయన కీలకపాత్ర పోషించారు. కనుక ఆయన చేసిన ఈ తాజా ప్రకటన ఇటు భారత్‌లోని అటు శ్రీలంకలోను ప్రకంపనలు సృష్టిస్తోంది.
దీనిపై శ్రీలంక సైన్యం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బ్రిగ్రేడియర్ రవి హెరాత్ వెంటనే స్పందిస్తూ,” నెడుమారన్ చెప్పినది అంతా అబద్దం. ఆరోజు (2009) శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈ మీద దాడి చేసినప్పుడు దాని అధినేత ప్రభాకరన్ కూడా చనిపోయారు. ఆయన చనిపోయిన్నట్లు ధృవీకరించే అన్ని ఆధారాలు మా వద్ద భద్రంగా ఉన్నాయి. ఆయన మృతదేహం తాలూకు ఫోటోలతో పాటు చనిపోయింది ఆయనే అని ధృవీకరించుకోవడానికి మేము డీఎన్ఏ పరీక్షలు కూడా చేయించాము. వాటిలో కూడా ఆయనే అని నిర్ధారించుకొన్న తర్వాతే మేము ఆయన చనిపోయిన్నట్లు ప్రకటించాము. ఆయన బ్రతికే ఉన్నారని నెడుమారన్ చెపుతున్నారు కనుక ఆయననే నిరూపించాల్సి ఉంటుంది. మేము కాదు. ఒకవేళ మీడియా కావాలనుకొంటే శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి ఆ వివరాలు పొందవచ్చు,” అని చెప్పారు.