
తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో విద్యాశాఖపై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీలపై కొందరు న్యాయస్థానాలని ఆశ్రయిస్తుండటం వలన ఆలస్యమవుతోందని, హైకోర్టు సూచనల మేరకు అన్ని సమస్యలని పరిష్కరించుకొంటూ బదిలీల ప్రక్రియని కొనసాగిస్తున్నామని తెలిపారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకి వెళ్ళిన ఉపాధ్యాయులకి మళ్ళీ పాత జిల్లాలలో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో 9,123 ప్రభుత్వ పాఠశాలలకి ‘మన ఊరు-మన బడి’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా రూ.2,516 కోట్లతో మరమత్తులు చేయిస్తున్నామని అవి జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.
ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకి మధ్యాహ్నం భోజన పధకం కోసం రూ. 1,024 కోట్లు ఖర్చవుతుంటే దానిలో కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.228 కోట్లు ఇస్తోందని మిగిలినది రాష్ట్ర ప్రభుత్వమేభరిస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఎడ్పడక మునుపు గురుకుల పాఠశాలలపై అప్పటి ప్రభుత్వం రూ.740 కోట్లు కేటాయించగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రూ. 3,400 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే మహబూబాబాద్, కొత్తగూడెంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలని ఏర్పాటుచేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.