ఈ నెల 17వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం జరుగవలసి ఉండగా ఆ కార్యక్రమ్యాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్ళీ ఎప్పుడు జరుపుతామో త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం తేదీ ముందే ఖరారు చేసుకొన్నందున అదే రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకొనేందుకు అనుమతించమని కోరుతూ సిఎస్ శాంతికుమారి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కోరారు. కానీ సానుకూల స్పందన రాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సిఎం కేసీఆర్ వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ద చూపుతూ సచివాలయాన్ని నిర్మించుకొంటున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమమే వాయిదా పడింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మార్చి 16వ తేదీన ఫలితాలు ప్రకటించడంతో ముగుస్తుంది. కనుక అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. కనుక ఆ తర్వాతే కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోవలసి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిలిపివేయవలసి రావచ్చు.
హైదరాబాద్ స్థానిక సంస్థలు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈ నెల 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిభ్రవరి 23వరకు నామినేషన్లకి గడువు ఉంటుంది. మార్చి 13న రెండు స్థానాలకి పోలింగ్ నిర్వహించి, 16వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలని ప్రకటిస్తారు.