ఫిభ్రవరి నెలాఖరులోగా పోడు భూములు పంపిణీ: కేసీఆర్‌

తెలంగాణ సిఎం కేసీఆర్‌ శుక్రవారం శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొత్తం 66 లక్షల ఎకరాల అటవీభూములు ఉన్నట్లు గుర్తించామని వాటిలో 11.5 లక్షల ఎకరాల పోడు భూములకి పట్టాలని ఫిభ్రవరి నెలాఖరు నుంచి గిరిజనులకి పంపిణీ చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు గిరిజన బంధు పధకం కూడా ఇస్తామని, గిరిజనులకి విద్యుత్‌, త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఇవి పొందిన గిరిజనులు ఇకపై ప్రభుత్వ అటవీ స్థలం ఒక్క గజం కూడా ఆక్రమించబోమని, అడవిలో చెట్లు నరకబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ హామీని ఉల్లంఘిస్తే, పోడు భూముల పట్టాలు రద్దు చేసి, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము. పోడు భూములలో సాగు చేసుకొనే గిరిజనులని పోలీసులు, అటవీశాఖ అధికారులు వేధించకూడదు. అలాగే వారిపై గిరిజనులు దాడులు చేయరాదు,” అని అన్నారు.  

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ పోడు భూముల సమస్య, దీనిపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాల గురించి, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి వస్తున్న గుత్తి కోయలు తెలంగాణ అడవులలో చెట్లు నరికివేస్తుండటం, పర్యావరణ పరిరక్షణ తదితర సమస్యలపై సుదీర్గంగా ప్రసంగించారు. సున్నితమైన ఈ సమస్యని తమ ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు దీనిపై రాజకీయాలు చేస్తూ గిరిజనులని రెచ్చగొట్టడం సరికాదన్నారు. గిరిజనులకి గిరిజనబంధు ఇచ్చి, పోడు భూములకి పట్టాలు ఇవ్వడం ద్వారా అడవుల నరికివేతని అడ్డుకోగలమని భావిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు.