ఇస్రో బుజ్జి రాకెట్ ప్రయోగం విజయవంతం

ఇస్రో బుజ్జి రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇప్పటివరకు ఇస్రో నమ్మిన బంటుగా ఉన్న జిఎస్ఎల్‌వి శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌తో ఇస్రో అంతరిక్షంలోకి ఉపగ్రహాలు ప్రవేశపెడుతోంది. అయితే జిఎస్ఎల్‌వి చాలా భారీ వెహికల్ కావడంతో తక్కువ సంఖ్యలో ఉపగ్రహాలని ప్రయోగించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చిన్న సైజులో ఎస్ఎస్ఎల్‌వి-డి1 శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ని తయారుచేశారు. జీఎస్ఎల్‌వితో పోలిస్తే దీని ఖర్చు సగం ఉంటుందని సమాచారం. 

అయితే గత ఏడాది ఈ బుజ్జి రాకెట్ (శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌) ప్రయోగం విఫలమయ్యింది. ఆ ప్రయోగంలో ఎదురైన లోపాలని, సమస్యలని అన్నిటినీ పరిష్కరించి ఎస్ఎస్ఎల్‌వి-డి2 తయారు చేసి దాంతో ఈరోజు ఉదయం 9.21 గంటలకి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. దీని ద్వారా మూడు ఉపగ్రహాలని విజయవంతంగా నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టారు. 

మొదటి ప్రయోగం విఫలమైనప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందినప్పటికీ పట్టుదలగా పనిచేసి కేవలం 5 నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎల్‌వి-డి2 తయారుచేయడమే కాకుండా దాంతో మూడు ఉపగ్రహాలని విజయవంతంగా నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తదితర ప్రముఖులు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్, ఎస్ఎస్ఎల్‌వి-డి2 మిషన్ డైరెక్టర్ ఎస్.వినోద్, ఇస్రో శాస్త్రవేత్తలకి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రోలో పండుగ వాతావరణం నెలకొంది. 

ఎస్ఎస్ఎల్‌వి-డి2 ప్రయోగం విజయవంతం అవడంతో ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలని పంపించగల దేశంగా భారత్‌ నిలిచింది. దీంతో వివిద దేశాలు తమ ఉపగ్రహాలని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో సేవలని వినియోగించుకొంటాయి కనుక అంతరిక్ష వ్యాపారంలో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది.