తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు.. షెడ్యూల్ జారీ

తెలంగాణలో మళ్ళీ ఎన్నికల గంట మ్రోగింది. హైదరాబాద్‌ స్థానిక సంస్థలు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకీ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయం షెడ్యూల్ ప్రకటించింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకి ఈ నెల 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఫిభ్రవరి 23వరకు నామినేషన్లకి గడువు ఉంటుంది. మార్చి 13న రెండు స్థానాలకి పోలింగ్ నిర్వహించి, 16వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలని ప్రకటిస్తారు.

స్థానిక సంస్థల కోటాలో సయ్యద్ అమీనుల్ హాసన్ జఫ్రీ, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు జరుగబోతున్నాయి.

ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకి, మూడు పట్టభద్రుల స్థానానికి ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ నేటి నుంచే అమలులోకి వస్తుంది.