కేంద్ర ఎన్నికల కమీషన్ యుపి, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలని ఒకేసారి ఫిబ్రవరి-మార్చి నెలల మద్య నిర్వహించాలని భావిస్తోంది. వాటిలో యూపి తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల శాసనసభల గడువు 2017, మార్చి 18 తో ముగియబోతోంది. యూపి శాసనసభకి 2017 మే నెల వరకు గడువు ఉంది. కనుక దానిని కొద్దిగా ముందుకి జరిపి ఐదు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. త్వరలోనే కేంద్రప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకొంటుంది.
మిగిలిన నాలుగు రాష్ట్రాల శాసనసభ గడువు ముగుస్తున్నందున, అవి ఎన్నికల నిర్వహణకి అభ్యంతరం చెప్పలేవు కానీ యూపి శాసనసభకి మే నెల వరకు గడువు ఉన్నందున, కొద్దిగా ముందస్తు ఎన్నికల నిర్వహణకి దాని ఆమోదం తప్పనిసరి. ఒకవేళ ముందస్తు ఎన్నికలకి యూపి ప్రభుత్వం కూడా అంగీకరించినట్లయితే, ఆ రాష్ట్రంలో మొత్తం ఏడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో, తన స్వంత పార్టీతో చాలా గొడవలు పడుతున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఆ ఏర్పాట్లు పూర్తి చేసుకోవడానికి ఆయనకి సమయం అవసరం కనుక ఈ ప్రతిపాదనకి ఆయన అంగీకరిస్తారో లేదో చూడాలి.