తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ద ఆలయాలలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద గల ఆంజనేయస్వామి ఆలయం కూడా ఒకటి. మహిమాన్వితుడైన ఆంజనేయస్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. కనుక కొండగట్టు అంజన్న ఆలయాభివృద్ధి కొరకు వంద కోట్లు మంజూరు చేస్తానని సిఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబర్లో జగిత్యాల పర్యటనకి వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ నిధులని విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్రావు నిన్న శాసనసభలో ప్రకటించారు. అతి త్వరలోనే ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణపనులకి వంద కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రసంగిస్తూ, “సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం, సాగునీటి రంగాలు తీవ్ర వివక్షకి గురయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ చక్కటి ప్రణాళికలతో వాటిని చక్కదిద్దారు. రూ.73,235 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించాము. అదే ప్రాజెక్టుని ఇప్పుడు నిర్మించాలంటే రూ.1.15 లక్షల కోట్లు అవుతుంది. ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పు గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కానీ దానిని శరవేగంగా పూర్తి చేసి రూ.35వేల కోట్లు మిగిల్చామనే విషయం గ్రహించడం లేదు.
ప్రధాని నరేంద్రమోడీ దేశానికి చేసిందేమీ లేదు. దేశ సంపద అంబానీ, అదానీలకి దోచిపెడుతున్నారు. అదానీ సిద్దాంతాన్ని అమలుచేస్తున్న ఏకైక ప్రధాని మోడీ. కనుక కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ మోడల్ అభివృద్ధే ఇప్పుడు దేశానికి చాలా అవసరం.” అని మంత్రి హరీష్ రావు అన్నారు.