రేవంత్‌ రెడ్డిపై బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు డిజిపికి ఫిర్యాదు

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంగళవారం ములుగు జిల్లాలో ‘హత్ సే హాత్ జోడో’ పాదయాత్ర ప్రారంభిస్తూ, “సిఎం కేసీఆర్‌ పేదలకి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు కట్టించి ఇవ్వడం లేదు కానీ తన కోసం రూ.2,000 కోట్లతో రాజమహల్ వంటి ప్రగతి భవన్‌ని నిర్మించుకొన్నారు. దానిలో పేదలకి ప్రవేశం లభించదు. ప్రజలకి ప్రవేశం లభించని అటువంటి ప్రగతి భవన్‌ ఎందుకు?ఆనాడు నక్సలైట్లు గడీలని డైనమైట్లు పెట్టి పేల్చివేసేవారు. అలాగే ప్రగతి భవన్‌ని కూడా పేల్చివేయడం మంచిది,” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

 ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ని బాంబులు పెట్టి పేల్చివేయాలంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయనకి గాంధీజీ, కాంగ్రెస్‌ సిద్దాంతాలు వంటబట్టలేదని తన మాటలతో అర్దం అవుతోందని బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి తదితర సీనియర్ కాంగ్రెస్‌ నాయకులు ఏకీభవిస్తారా... రేవంత్‌ రెడ్డిని సమర్దించగలరా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో కూడా ఇలాగే ప్రభుత్వ భవనాలని పేల్చివేయమని రేవంత్‌ రెడ్డి చెప్పగలరా?అని నిలదీశారు. 

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బిఆర్ఎస్‌ నేతలు బుదవారం డిజిపి అంజని కుమార్‌ని కలిసి పిర్యాదు చేశారు. ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని పేల్చేయాలని అన్నాడుకు ఆయనపై పిడీ యాక్టివ్‌గా కింద కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.