రాములు నేతృత్వంలో బిసి కమీషన్ ఏర్పాటు

రాష్ట్ర బీసీ కమీషన్ న్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు ఫైల్ పై సంతకం చేశారు. బీసి కమీషన్ చైర్మన్ గా ప్రముఖ రచయిత మరియు సామాజికవేత్త బి.ఎస్. రాములును నియమించారు. దీనిలో ముగ్గురు సభ్యులని నియమించారు. వారు డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరిశంకర్, వకుళాభరణం కృష్ణమోహన్.

బిసి కమీషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం మూడేళ్ళుగా నిర్ణయించారు. వారికి కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యులకి కల్పించిన హోదా, సదుపాయాలు లభిస్తాయి.   

బిసి కమీషన్ చైర్మన్ గా నియమించబడిన రాములు సామాజిక కార్యకర్తగా, రచయితగా, తెలంగాణా ఉద్యమ నేతగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులే. ఆయనకి బిసిల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంచి అవగాహన ఉంది. ఆ సమస్యలపై ఆయన అనేక రచనలు కూడా చేశారు.   

డా. ఈడిగ అంజనేయులు గౌడ్ తెలంగాణా బిసి ఫారం అధ్యక్షుడుగా అందరికీ సుపరిచితులు. ఆయన కూడా తెలంగాణా విద్యార్ధి ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వ్యక్తే. 

జూలూరి గౌరిశంకర్ కూడా మంచి రచయిత, కవిగా పేరొందినవారే. ఆయన తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులుగా వ్యవహరించారు. 

డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004-2009 మధ్య కాలంలో రెండుసార్లు బీసీ కమీషన్ సభ్యులుగా పని చేశారు. బీసి సమస్యల గురించి పూర్తి అవగాహన, సానుభూతి ఉన్న మేధావులని కమీషన్ సభ్యులుగా నియమించడం వలన రాష్ట్రంలో బీసిలకి పూర్తి న్యాయం చేకూరుతుందని చెప్పవచ్చు.