ఖమ్మం బిఆర్ఎస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకోవడంతో సిఎం కేసీఆర్ మీద గట్టిగానే విమర్శిస్తున్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెంలోని దమ్మపేటలో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, “రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే గిరిజన, ఆదివాసీల కష్టాలని తీర్చేస్తామన్నారు. కానీ గ్రామ సర్పంచ్లకి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో వారు తమ భార్యల మెడలో పుస్తెలు సైతం తాకట్టుపెట్టి అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. నాకు భారీ కాంట్రాక్టులు ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే దానిలో ఎవరెవరికి ఎంతెంత కమీషన్లు చెల్లించానో వివరాలు చెప్పమంటే చెప్పడానికి నేను సిద్దం. నాపై ఈ ఆరోపణలు చేస్తున్న నేతలకి ఈ అంశంపై బహిరంగ చర్చకి వచ్చే దమ్ముందా?
నా సమావేశాలకి హాజరవుతున్నవారిని బిఆర్ఎస్లో నుంచి సస్పెండ్ చేస్తున్నారు. మీకు దమ్ముంటే వారిని కాదు నన్ను సస్పెండ్ చేయండి. నేను ఏ పార్టీలో చేరాలో నా నియోజకవర్గంలో ప్రజలు, నా అనుచరులే నిర్ణయిస్తారు. వారిని సంప్రదించకుండా ఏదో ఓ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో నేను సూచించిన అభ్యర్ధులే బరిలో ఉంటారు. వారే ఎన్నికలలో తప్పక గెలుస్తారు,” అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.