ఈరోజు ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ, “ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే. ప్రతీసారి బడ్జెట్లో వివిదశాఖలకి, అభివృద్ధి, సంక్షేమ పధకాలకి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తుంటారు కానీ వాటిలో చాలా వాటికి ఒక్క రూపాయి కూడా చెల్లించారు. ఉదాహరణకి పంటరుణాల మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కానీ మళ్ళీ ఎన్నికలొచ్చేస్తున్నా ఇంతవరకు ఆ రెండు హామీలని కేసీఆర్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఈసారి బడ్జెట్లో ఆ రెండు హామీల అమలు గురించి ప్రస్తావించనే లేదు.
పంటరుణాల మాఫీ చేయకపోవడం వలన బ్యాంకులలో రైతుల అప్పు పెరిగిపోయి మళ్ళీ కొత్తగా అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. కేసీఆర్ సర్కార్ నిరుద్యోగభృతి హామీని పూర్తిగా మరిచిపోయిన్నట్లే ఉంది. బడ్జెట్ ఘనం కేటాయింపులు శూన్యం అన్నట్లుంది ఈ ప్రభుత్వం పరిస్థితి.
లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఆర్ధికమంత్రి హరీష్ రావు గొప్పలు చెప్పుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతీనెల సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకా మద్యాహ్న భోజన పధకం, ఆరోగ్యశ్రీ తదితర పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ ఆయా సమస్యలని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తోందంటూ ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పు పట్టారు.