తెలంగాణ వెలుపల బిఆర్ఎస్‌ తొలిసభ విజయవంతం

టిఆర్ఎస్‌ పార్టీ బిఆర్ఎస్‌ పార్టీగా మారిన తర్వాత రాష్ట్రం వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం తొలిసారిగా నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు చక్కటి ప్రణాళికతో పనిచేసి సభని విజయవంతం చేశారు. సిఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకి నాందేడ్‌ చేరుకొని ముందుగా స్థానిక గురుద్వారని సందర్శించారు. అనంతరం సభా వేదిక వద్దకి చేరుకొని వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్, జ్యోతీరావు ఫూలే. సావిత్రీబాయి, అన్నాబావు సాటే విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

కేసీఆర్‌తో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, షకీల్, మైనంపల్లి హనుమంతరావు, హన్మంత్ షిండే, జోగు రామన్న, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇంకా రవీందర్ సింగ్, విఠల్ రావు, లలిత, ఏపీ బిఆర్ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు. 

మరాఠీ ప్రజలకి చేరువయ్యి వారిని బిఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఈ బహిరంగసభలో నిర్వహిస్తున్నందున ఈ సభకి మరాఠీ భాషలో ‘పక్ష ప్రవేశ సోహల్’ (పార్టీ చేరిక సభ) అని పేరు పెట్టారు. బిఆర్ఎస్‌ నేతలు ముందుగానే నాందేడ్‌లోని పలుమార్లు పర్యటించి స్థానిక నేతలు, ప్రజలతో మాట్లాడినందున ఈ సభలో కేసీఆర్‌ సమక్షంలో ఓ మాజీ ఎమ్మెల్యేతో సహ సుమారు 30 మంది బిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. సిఎం కేసీఆర్‌ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సభలో సిఎం కేసీఆర్‌ 52 నిమిషాల సేపు అనర్గళంగా హిందీలో మాట్లాడుతూ స్థానిక ప్రజలని ఆకట్టుకొన్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు పధకాలకు సంబందించి వీడియోలని ప్రదర్శించి చూపి, రూ.2.5 లక్షల వార్షిక బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో ఇటువంటి పధకాలు అమలుచేస్తున్నప్పుడు, రూ.5 లక్షల బడ్జెట్‌ కలిగిన మహారాష్ట్రలో ఎందుకు అమలుచేయలేకపోతున్నారని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

దేశంలో పుష్కలంగా వనరులున్నప్పటికీ ఇప్పటి మోడీ ప్రభుత్వంతో సహా ఇంతవరకు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వాటిని సమర్ధంగా వినియోగించుకోకపోవడం వలననే నేటికీ దేశం ఈ దుస్థితిలో ఉందన్నారు. సంపద సృష్టించి దేశంలోని ప్రజలకి పంచకుండా వాటిని అదాని వంటి కార్పొరేట్ కంపెనీలకి దోచిపెడుతున్నారని అన్నారు. 

పాలకులకి ధృడ సంకల్పం, దూరదృష్టి ఉంటే దేశాన్ని తెలంగాణ రాష్ట్రంలాగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని, తప్పుడు నిర్ణయాలని వాటి వలన దేశానికి కలిగుతున్న నష్టాన్ని వివరించి, బిఆర్ఎస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు చేపట్టబోతోందో ప్రజలకి వివరించారు. మహారాష్ట్రలోని తొలి బిఆర్ఎస్‌ సభలో ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. 


అనంతరం సిఎం కేసీఆర్‌ నాందేడ్‌లోనే ప్రెస్‌మీట్‌లో ఇంచుమించు ఇవే అంశాలపై సుదీర్గంగా మాట్లాడారు. రావోయే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ 288 స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పారు. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందన్నారు. మహారాష్ట్రలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల గురించి బిఆర్ఎస్‌ వైఖరిపై విలేఖరులు అడిగిన ప్రశ్నకి ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, సంప్రదింపులు, భౌగోళిక పరిస్థితులు, శాస్త్రీయత తదితర అంశాలతో ముడిపడి ఉన్న అంశం కనుక దీనిపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడుతానని కేసీఆర్‌ చెప్పారు. ఈ సభ, ప్రెస్‌మీట్‌లో సిఎం కేసీఆర్‌ విద్యుత్, నదీ జలాలు, బొగ్గు లభ్యత, వినియోగం, కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలు తదితర పలు అంశాల గురించి తన అభిప్రాయాలని, బిఆర్ఎస్‌ వైఖరిని వివరించారు.