గవర్నర్‌ని గౌరవించరు కానీ... ధన్యవాద తీర్మానం!

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో రెండో రోజైన నేడు ఆనవాయితీ ప్రకారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. గత ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండ అమర్యాదగా వ్యవహరిస్తోందని, మంత్రుల చేత అనుచిత విమర్శలు చేయిస్తోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్వయంగా పలుమార్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఆహ్వానించకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించబోయి భంగపడింది. విధిలేని పరిస్థితులలో ఆమెని ఆహ్వానించి, ఈరోజు ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు కూడా చెప్పబోతోంది. ఇది స్వయంకృతమే అని అందరికీ తెలుసు.        

 ఆది, మంగళవారాలు శాసనసభ, మండలికి సెలవు దినాలు కనుక సోమవారం సమావేశమైనప్పుడు మంత్రులు హరీష్ రావు శాసనసభలో వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ రూ.3 లక్షలు పైనే ఉండబోతోందని సమాచారం. మళ్ళీ ఫిభ్రవరి 8న రాష్ట్ర బడ్జెట్‌పై చర్చిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. 

రేపు ఆదివారం ఉదయం 10.30 గంటలకి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. దానిలో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకి సిఎం కేసీఆర్‌ మంత్రులతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్‌కి వెళ్ళి అక్కడ బిఆర్ఎస్‌ అధ్వర్యంలో లో నిర్వహిస్తున్న సభలో పాల్గొంటారు.