నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు షురూ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ప్రభుత్వం మద్య రాజీ కుదరడంతో నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. మొదట ఆమె ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలనుకొంది. కానీ హైకోర్టు సూచన మేరకు వెనక్కి తగ్గి ఆమెని ఆహ్వానించక తప్పలేదు. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకి ఆమె ఉభయసభల సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆమె ప్రభుత్వం తయారుచేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్నే చదవాల్సి ఉంటుంది. రాజ్‌భవన్‌-రాష్ట్ర ప్రభుత్వం మద్య దూరం పెరిగి, తనపై మంత్రులు విమర్శలు చేస్తుండటంపై ఆమె తన ప్రసంగంలో ఏమైనా విమర్శలు చేసిన్నట్లయితే చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగం ముగిసిన తర్వాత శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. దానిలో ఉభయసభల అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు. 

ఈ నెల 5వ తేదీ ఉదయం 10.30 గంటలకి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో 2023-24 రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఫిభ్రవరి 6న ఉదయం 10.30 గంటలకి శాసనసభలో రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. 

నేటి నుంచి శాసనసభ, మండలి సమావేశాలు మొదలవుతున్నందున పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులని మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.