తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకి త్వరలోనే వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటిస్తామని రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉద్యోగుల ఐకాస ప్రతినిధులకి హామీ ఇచ్చారు. టీఈఈజెఈసీ కన్వీనర్‌గా ఎన్ శివాజీ నేతృత్వంలో ఉద్యోగ సంఘం ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి పీఆర్సీ, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ విధానం మార్పు, ఇంజనీర్ల రివర్షన్ కేసులు, ఉద్యోగుల భర్తీ తదితర అంశాలపై మాట్లాడి వినతిపత్రం ఇచ్చారు. వారు కోరిన అన్ని అంశాల గురించి సీఎండీ ప్రభాకర్ రావుతో చర్చించి త్వరలో నిర్ణయాలు తీసుకొంటామని చెప్పారు. ముందుగా పీఆర్సీ, ఉద్యోగాల భర్తీపై దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే 1533 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల రివర్షన్ సమస్యని కూడా పరిశీలించి ఎవరికీ అన్యాయం జరుగకుండా నిర్ణయాలు తీసుకొంటామని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్యోగ సంఘం ప్రతినిధులకి హామీ ఇచ్చారు.