నేటి నుంచి మేడారం చిన్న జాతర ప్రారంభం

నేటి నుంచి మేడారం చిన్న జాతర ప్రారంభం అయ్యింది. ప్రతీ రెండేళ్ళకోసారి జరిగే మేడారం మహాజాతరకి మద్య సంవత్సరంలో జరిగేదే ఈ చిన్న జాతర. నేటి నుంచి ఫిభ్రవరి 4వ తేదీ వరకు మేడారం చిన్న జాతర జరుగుతుంది. దీనినే మండమెలిగే జాతర అని కూడా అంటారు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుదవారంనాడు మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాలని శుద్ధి చేసి ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకొంటారు. చిన్న జాతరలో కూడా భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలని దర్శించుకొని బెల్లం దిమ్మలని నైవేధ్యంగా సమర్పిస్తారు. 

ఈ నాలుగు రోజులలో మేడారంకి సుమారు 20-30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కనుక మేడారం చిన్న జాతర కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. భక్తుల సౌకర్యం కోసం ఎక్కడికక్కడ త్రాగునీరు, అంబులెన్సులు వగైరా అవసరమైన ఏర్పాట్లు చేశారు. టీఎస్‌ఆర్టీసీ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి మేడారంకి ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. పోలీస్ శాఖ భారీగా పోలీసులని మోహరించి, ఎక్కడికక్కడ సిసి కెమెరాలతో నిఘా పెట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాల నియంత్రణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసారు. వాహనాల పార్కింగ్ కోసం మేడారం పరిసర ప్రాంతాలలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.