
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మద్య రాజీ కుదరడంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలకి ముహూర్తం ఖరారైంది. ఫిభ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకి ఉభయసభల సభ్యులని ఉద్దేశ్యించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజున గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిపి ధన్యవాద తీర్మానం చేస్తారు. అనంతరం బీఏసీ మీటింగ్ నిర్వహించి బడ్జెట్ సమావేశాల అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఫిభ్రవరి 5వ తేదీ (ఆదివారం) సమావేశాలు ఉండవు. ఫిభ్రవరి 6వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఆర్ధికమంత్రి హరీష్‌రావు శాసనసభలో, వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో 2023-24 సం.ల బడ్జెట్‌ని ప్రవేశపెడతారు.
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రమేయం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రయత్నించి భంగపడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా బడ్జెట్‌కి ఆమోదం తెలుపకుండా పక్కన పెట్టడంతో హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ఉన్నతాధికారులు ఆమె వద్దకి వెళ్ళి బడ్జెట్ సమావేశాలలో ప్రసంగించవలసిందిగా సగౌరవంగా ఆమెని ఆహ్వానించడంతో ఆమె కూడా బెట్టు చేయకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదా బడ్జెట్‌కి ఆమోదముద్ర వేశారు. దీంతో రాజ్యాంగ సంక్షోభం తప్పింది. తెలంగాణ బడ్జెట్ ఈసారి రూ.3 లక్షల కోట్లు ఉండబోతున్నట్లు సమాచారం.