6.jpg)
బిజెపి ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కి హైదరాబాద్ పోలీసులు మళ్ళీ నోటీసు ఇచ్చారు. రెండు రోజుల క్రితం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వర్గం ప్రజలని రెచ్చగొట్టేవిదంగా మాట్లాడి, తెలంగాణ హైకోర్టు విధించిన బెయిల్ షరతులని ఉల్లంఘించినందుకు రెండు రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
గత ఏడాది ఆగస్ట్ నెలలో రాజా సింగ్ ముస్లింలని కించపరుస్తూ మాట్లాడిన తన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో బిజెపి అధిష్టానం ఆగ్రహించి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ కేసులో ఆయనని ఆగస్ట్ 25న అరెస్ట్ చేసి జైలుకి పంపగా హైకోర్టుని ఆశ్రయించి నవంబర్ 9న షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. కానీ హైకోర్టు విధించిన ఆ షరతులని పాటించకుండా మళ్ళీ ప్రజలని రెచ్చగొట్టేవిదంగా మాట్లాడినందుకు పోలీసులు మళ్ళీ ఆయనకి నోటీసు జారీ చేశారు. కనుక రాజాసింగ్ మళ్ళీ మరోసారి జైలుకి వెళ్ళవలసిరావచ్చు.
పోలీసులు తనకి మళ్ళీ నోటీస్ పంపడంపై రాజా సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “నేను ముంబైలో మాట్లాడాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే మహారాష్ట్ర పోలీసులు నాకు నోటీస్ ఇవ్వాలి కానీ నిజాం పాలనకి వత్తాసు పలుకుతున్న తెలంగాణ పోలీసులు నోటీస్ ఇచ్చారు. దేశంలో గోహత్యలు, మత మార్పిడులు, లవ్ జిహాద్ వంటివి నివారించడానికి చట్టం చేయాలని నేను కోరాను. అది ప్రజలని రెచ్చగొట్టడం ఎలా అవుతుందో నాకు తెలీదు. కానీ పోలీసుల నోటీసులకి, కేసులకి, జైలుకి నేను భయపడే ప్రసక్తే లేదు. ధర్మాన్ని కాపాడటం కోసం నేను చావడానికైనా సిద్దమే,” అని అన్నారు.