2.jpg)
బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం జరిగిన బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిజెపిలో కూడా కేసీఆర్ నాకు పొగ పెడుతున్నారు. ఇతర పార్టీలలో చిచ్చు పెట్టే చిల్లర అలవాటు కేసీఆర్‌కి ఇంకా పోయిన్నట్లు లేదు. అందుకే నేను పార్టీ మారబోతున్నానంటూ దుష్ప్రచారం చేయిస్తున్నారు. నేను ఏ పార్టీని నమ్ముకొంటే అదే పార్టీని అంటిపెట్టుకొని ఉంటాను తప్ప అవకాశవాద రాజకీయకీయాలు చేయను. వాటి కోసం పార్టీలు మారే అలవాటు నాకు లేదు.
కేసీఆర్ నన్ను టిఆర్ఎస్‌లో నుంచి బయటకి వెళ్ళగొట్టారు కనుకనే నేను బయటకి వచ్చాను తప్ప నా అంతట నేను రాలేదు. కేసీఆర్ నన్ను పార్టీలో నుంచి బయటకి వెళ్ళగొట్టినప్పుడు బిజెపి నన్ను అక్కున చేర్చుకొని ఆదరించి టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. అటువంటి పార్టీని నేను ఎందుకు వీడుతాను?రాష్ట్రంలో బిజెపిని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ని, ఆయన పార్టీని ఒడగొట్టి బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే నా ఏకైక లక్ష్యం,” అని స్పష్టం చేశారు.
అయితే ఈటల రాజేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “బిజెపిలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ,’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ బిజెపి నేతలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ కోవర్టులు ఎవరో బయటపెట్టాలని బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి ఈటల రాజేందర్‌ని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కానీ ఈటల రాజేందర్ స్పందించలేదు. అయితే తెలంగాణ బిజెపిలో కూడా అంతర్గతంగా కుమ్ములాటలు కొనసాగుతున్నాయని ఈటల రాజేందర్, విజయశాంతి మాటలతో స్పష్టమవుతోంది.