గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక నిరాశ చెందుతున్నవారికి శుభవార్త! దరఖాస్తులు సమర్పించడానికి ఫిభ్రవరి 3వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్న టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి సోమవారమే చివరి రోజు కావడంతో ఇవాళ్ళ ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఇంకా చాలావేలమంది దరఖాస్తు సమర్పించడానికి ప్రయత్నిస్తుండటంతో టిఎస్‌పీఎస్సీ సర్వర్ హ్యాంగ్ అయిపోయింది. కొంతమంది ఫీజు చెల్లిస్తున్నప్పుడు సర్వర్ స్థంభించిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చాలామందికి ఇటువంటి అనుభవాలే ఎదురవడంతో వారందరికీ ఉపశమనం కలిగిస్తూ దరఖాస్తుల గడువు ఫిభ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది.   

గ్రూప్-4లో 8,180 ఉద్యోగాలకి టిఎస్‌పీఎస్సీ సోమవారం నాటికి 8,47,277 మంది దరఖాస్తు చేసుకొన్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇప్పుడు గడువు పొడిగించింది కనుక ఈ నాలుగు రోజులలో మరో లక్షన్నర మంది దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. ఒక్క గ్రూప్-4 ఉద్యోగాలకే ఇన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకొంటున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు.