
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో సోమవారం నందిపేట గ్రామ సర్పంచ్ వాణి, ఆమె భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొనడంతో వారి ప్రాణాలు దక్కాయి. అనంతరం సర్పంచ్ భర్త విలేఖరులతో తన గోడు మొరపెట్టుకొంటూ, “మేము టిఆర్ఎస్‌లోకి వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయని చెపితే ఇద్దరం పార్టీలో చేరాము. కానీ అప్పటి నుంచే మా కష్టాలు మొదలయ్యాయి. మేము మా భూములు అమ్ముకొని ఆ డబ్బుతో పంచాయతీ పనులు చేయిస్తే రెండేళ్ళయినా ఆ బిల్లులు చెల్లించలేదు. ఒకటీ రెండూ లక్షలు కావు ఏకంగా రెండు కోట్లు మేము ఖర్చు చేశాము. వాటికి వడ్డీలు కట్టుకోలేక నానా తిప్పలు పడుతున్నాము.
ప్రభుత్వం సర్పంచులకి చెక్ పవర్ రద్దు చేయడంతో మాకు రావలసిన పైసల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము కానీ మా బిల్లులు చెల్లించడం లేదు. పంచాయతీలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కుమ్మకై మా బిల్లులు రాకుండా అడ్డుకొంటున్నారు. మమ్మల్ని టిఆర్ఎస్‌లోకి రప్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. బిల్లుల బకాయిలు వచ్చేలా చేయమని మేము ఎంతగా బ్రతిమాలుకొంటున్నా పట్టించుకోవడం లేదు.
మేము చేసిన అప్పులు వాటికి వడ్డీలతో కలిపి సుమారు రూ.4 కోట్లు వరకు పెరిగిపోయింది. ఇక అమ్ముకోవడానికి మా వద్ద మరేమీ లేదు. కనుక ప్రాణాలు తీసుకోవాలనుకొంటున్నాము. మాకు మా బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని, కలెక్టర్‌ని వేడుకొంటున్నాము,” అంటూ భార్యభర్తలిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు.