ఒడిశాలో ఆరోగ్యశాఖ మంత్రిపై ఏఎస్సై కాల్పులు...

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిషోర్ దాస్‌పై ఓ పోలీస్ అధికారి (ఏఎస్సై) కాల్పులు జరపడంతో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. 

ఆదివారం ఉదయం ఆయన ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్ నగర్‌లో గాంధీ చౌక్ వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు, ఆయన కారులో నుంచి బయటకి దిగుతుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ గోపాల్ దాస్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకొన్న ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ వెంటనే హెలికాఫ్టర్‌ని పంపించి ఆయనని భువనేశ్వర్‌లోని అపోలో హాస్పిటల్‌కి తరలింపజేశారు. వైద్యులు ఆయనకి శస్త్రచికిత్స చేసి బుల్లెట్ బయటకి తీశారు. కానీ బుల్లెట్ గుండె, ఊపిరి తిత్తులకి మద్యన తగలడంతో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. శస్త్రచికిత్స చేసినప్పటికీ ఆయన మృతి చెందారు. 

పోలీసులు ఏఎస్సై గోపాల్ దాస్‌ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా గోపాల్ దాస్‌ మానసిక పరిస్థితి సరిగాలేదని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. 

గోపాల్ దాస్‌ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. ఒడిశాలో బిజూ జనతా దళ్ పార్టీని బలోపేతం చేయడానికి చాలా శ్రమించారు. కనుక అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా ఆయనకి మంచి పేరుంది. ఆయన మృతిపట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు.