ఈరోజు కూడా గవర్నర్‌ రాజకీయాలేల?

ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తూ, ఎత్తైన భవనాలు కట్టుకోవడం అభివృద్ధి కాదని జాతి నిర్మాణమే అభివృద్ధి అని అన్నారు. రాష్ట్రంలో కొందరికే ఫామ్‌హౌస్‌లు ఎందుకు? ప్రతీ ఒక్కరికీ ఫామ్‌హౌస్‌ ఉండే విదంగా రాష్ట్రం ఎదగాలన్నారు. కొందరికి నేనంటే ఇష్టంలేదని కానీ నాకు మాత్రం తెలంగాణ రాష్ట్రమన్నా, ప్రజలన్నా చాలా ఇష్టమని అన్నారు. 

ఆమె చేసిన ఈ విమర్శలు సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి చేసినవే అని అర్దమవుతూనే ఉంది. కనుక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వాటిపై ఘాటుగా స్పందిస్తూ, “గణతంత్ర దినోత్సవం రోజున కూడా గవర్నర్‌ రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ ఆమె రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మేము రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి లేఖ వ్రాస్తాము,” అని అన్నారు. 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేసీఆర్‌ని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “కరోనా కష్టకాలంలో సెంట్రల్ విస్టా నిర్మాణం చేపట్టడం కంటే దేశంలో మౌలికవసతుల కల్పనపై దృష్టి పెట్టాలని మేము కోరాము. దేశంలో రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకి పని కల్పించే ప్రయత్నం చేసే బదులు కొందరు బడాబాబులకి మేలు చేయడం ఎందుకని మేము ప్రశ్నించాము. ఆనాడు సిఎం కేసీఆర్‌ అడిగిన ఈ ప్రశ్నలనే ఇప్పుడు గవర్నర్‌ నోట పలికినందుకు కృతజ్ఞతలు,” అని ట్వీట్‌పై చేశారు.