గణతంత్ర దినోత్సవం ఎలా నిర్వహించాలో మాకు తెలుసు!

తెలంగాణలో ఇంకా కరోనా ఉన్నందున ఈసారి రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ వ్రాయడంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఘాటుగా స్పందించడంతో బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. 

తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ గవర్నర్‌ని అవమానించలేదు. సిఎం కేసీఆర్‌ ఏనాడూ గవర్నర్‌ని ఉద్దేశ్యించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. అలాగే ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోటోకాల్ కూడా పాటిస్తూనే ఉంది. అనివార్య కారణాల వలననే ఈ ఏడాది సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలని నిర్వహించాలేమని కనుక రాజ్‌భవన్‌లో నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరింది తప్ప గణతంత్ర దినోత్సవ వేడుకలని నిర్వహించలేక కాదు. గణతంత్ర దినోత్సవ వేడుకలని ఎలా నిర్వహించాలో రాష్ట్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. మాకు ఎవరి సలహాలు అవసరం లేదు,” అని అన్నారు.