ఫిభ్రవరి 5న నాందేడ్‌లో బిఆర్ఎస్‌ బహిరంగసభ?

బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం వెలుపల తొలి బహిరంగసభ విశాఖపట్నంలో జరుపుతారని అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ సరిహద్దు జిల్లాగా మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఫిభ్రవరి 5వ తేదీన బహిరంగసభ నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం నాందేడ్‌లో సరిహద్దు గ్రామాల ప్రజలు పొరుగున తెలంగాణ గ్రామాలలో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు చూసి తమ గ్రామాలని తెలంగాణ రాష్ట్రంలో కలాపాలని కోరుతూ ఆందోళనలు చేశారు. కనుక నాందేడ్‌లో తొలిసభ నిర్వహిస్తే స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. అదీగాక, నాందేడ్‌ సరిహద్దు జిల్లా కనుక ఆ సభకి తెలంగాణలోని సరిహద్దు గ్రామాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయడం సులువవుతుందనే ఆలోచన కూడా ఉంది.

ఫిభ్రవరి 3వ తేదీన తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించి, 4,5 తేదీలలో సెలవు తీసుకోవాలని ముందే నిర్ణయించుకొన్నందున, 5వ తేదీన నాందేడ్‌లో బిఆర్ఎస్‌ బహిరంగసభ నిర్వహించవచ్చు. నాందేడ్‌లో బహిరంగసభ నిర్వహించడంపై మరోసారి మంత్రులతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించి, ఏర్పాట్లు ప్రారంభించవచ్చు. ఈలోగా మహారాష్ట్రలో కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో మాట్లాడి ఆయనతో సహా శివసేన నేతలు కూడా ఈ బహిరంగసభలో పాల్గొనేలా చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.