పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన రాజకీయ ప్రచార అవసరాల కోసం ప్రత్యేకంగా ‘వారాహి’ అనే ఓ వాహనాన్ని తయారుచేయించుకొన్న సంగతి తెలిసిందే. దానికి మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వాహన పూజ చేయిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నాచుపల్లి వద్దగల ఓ రిసార్టులో తన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వారాహి వాహనంలోనే హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. మళ్ళీ వీలువెంబడి ‘అనుష్టవ్ నారసింహ యాత్ర’ చేపట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో గల 31 నారసింహ క్షేత్రాలను దర్శించుకొంటారు.
రేపు నాచుపల్లిలో పార్టీ నేతలతో భేటీ అయినప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేయడంపై చర్చిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో జనసేనకి బలం ఉన్న కొన్ని నియోజకవర్గాలని పార్టీ నేతలు గుర్తించారు. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్ధుల ఎంపికపై కూడా రేపటి సమావేశంలో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్‌కి తెలంగాణలో కంటే ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత, ఒత్తిళ్ళని ఎదుర్కోవలసివస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుగా తన పర్యటనలలో ఇబ్బందులు సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నందున వారాహి వాహనంలో సకల ఏర్పాట్లు చేసుకొని బయలుదేరుతున్నారు.
వారాహిలో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్, హైదరాబాద్, ఏపీలోని జనసేన కార్యాలయాలతో అనుసంధానం చేయబడిన అడ్వాన్స్ కంప్యూటర్ మానిటరింగ్ సిస్టమ్, రాళ్ళ దాడిని తట్టుకొనే విదంగా బలమైన బాడీతో వారాహి వాహనాన్ని తయారు చేయించుకొన్నారు.