సచివాలయ భవనాన్ని తమకి అప్పగించాలన్న తెలంగాణా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి ఏపి సర్కార్ సానుకూలంగా స్పందించింది. విజయవాడలో నిన్న జరిగిన తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నేతలకి చెప్పగా వారు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం అయ్యి పరిష్కరించుకోవాలని వారు సూచించారు. ఈ సమావేశానికి తెలంగాణా తెదేపా నేతలు కూడా హాజరయ్యారు. హైదరాబాద్ లో సచివాలయం అప్పగింతపై సూత్రప్రాయంగా పార్టీ సమావేశంలో అంగీకరించారు కనుక త్వరలో ఏపి సర్కార్ అధికారికంగా ప్రకటించవచ్చు.
తెరాస సర్కార్ కూడా ఏపి ప్రభుత్వ అవసరాలని దృష్టిలో ఉంచుకొని, దానికి హైదరాబాద్ లో శాస్విత భవనాలు నిర్మించుకోవడానికి 10 ఎకరాలు ఇవ్వడానికి సిద్దపడింది. రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొంటూ ఇంత సానుకూలంగా, ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం చాలా హర్షణీయమే.
హైదరాబాద్ లోని షెడ్యూల్:10 క్రింద ఉండే ఆస్తుల పంపకాలు, డిల్లీలో ఆంధ్రా భవన్ విషయంలో తెరాస సర్కార్ పట్టువిడుపులు ప్రదర్శించాలని ఏపి సర్కార్ ఆశిస్తుంటే, ఉమ్మడి హైకోర్టు విభజనకి ఏపి సర్కార్ సహకరించాలని తెరాస సర్కార్ కోరుతోంది. నీటి పంపకాలపై పేచీలు ఇప్పట్లో తేలేవి కావు కానీ ఈ వ్యవహారాలని ఇదే విధంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ పంతాలు, పట్టింపులకి పోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని గ్రహిస్తే మంచిది.