వరంగల్‌లో బిఆర్ఎస్‌ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్ట్

వరంగల్‌లో ఏడో డివిజన్‌ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌ని శనివారం హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ అనుచరుడు వినయ్ భాస్కర్ అనుచరుడైన వేముల శ్రీనివాస్‌ హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్-2లో సునీత దంపతులకి చెందిన 200 గజాల నివాస స్థలాన్ని తన పేరిట ఏర్పాటు చేసిన వేముల శ్రీనివాస్ డెవలప్‌మెంట్ ఏజన్సీకి అప్పగించవలసిందిగా ఒత్తిడి చేస్తున్నాడు. కానీ వారు అందుకు అంగీకరించకపోవడండంతో నాలుగు రోజుల క్రితం వేముల శ్రీనివాస్ తన అనుచరులని వెంటబెట్టుకొని వెళ్ళి ఆ స్థలం చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్‌ని కూల్చేశాడు. దాంతో వారు హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నగర కమీషనర్ రంగనాథ్ ఆదేశం మేరకు హన్మకొండ పోలీసులు వేముల శ్రీనివాస్, అతని కారు డ్రైవర్ పడాల కుమారస్వామిపై సెక్షన్స్ 427,447,506 కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని ఖమ్మం సబ్ జైలుకి  తరలించారు.