ఫిభ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు?

ఫిభ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తాజా సమాచారం. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడే సాధారణంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. ఈనెల 31వ తేదీ నుంచి ఫిభ్రవరి 6వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు జరుగబోతున్నాయి. కనుక ఇంచుమించు అదే సమయంలో తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. కనుక ఫిభ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడానికి శాసనసభ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వాటి కంటే ముందుగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసి బడ్జెట్‌పై చర్చించి ఆమోదముద్రవేయాల్సి ఉంటుంది. అలాగే సభలో చర్చించాల్సిన ఇతర అంశాలకి సంబందించిన అజెండాని ఖరారు చేయవలసి ఉంటుంది. 

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలలో తొలిరోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభల సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, దాని నిర్మాణ పనులు ఇంకా పూర్తి కానందున ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనంలోనే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. 

తెలంగాణ సిఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై కత్తులు దూస్తున్నందున ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున ఆమెని ఉభయసభల సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగించేందుకు ఆహ్వానిస్తారో లేదో చూడాలి.